Thursday, October 24, 2019

రహస్యం..


ఎవరు తాను...?
ఏ జన్మలొనొ నా శ్వాసపు స్వరాల్లో
పాటలా ఇమిడిపోయిందనుకుంట!

ఇప్పుడు ఇలా..
నా గుండె చప్పుడుకు,
సరిగమలను పరిచయమం చేస్తుంది.
గమకాలను స్పష్టంగా పలికిస్తుంది.

కొత్తగా రెక్కలు విప్పుకుంటున్న
ప్రతీ అనుభూతి కూడా..
ఎన్నో తలపుల్ని మోసుకుంటూ
ఆమె ఊహ మైకంలో విహరిస్తున్నాయి.

తనకీ ఇవన్నీ తెలుస్తున్నాయా..?
కనిపిస్తున్నాయా..?
నా మనసు గట్టిగా వాదిస్తుంది..
తన రహస్యం అమెకి తెలుసని!
మరింత ఆశగా ఆమె చూస్తుందని!!

Friday, June 1, 2018

అకస్మిక వాన

ప్రతీ పరిచయం
ఒక చిరునవ్వు.
అకస్మిక వాన చినుకుల్లో
మెరిసే ఒక అందమైన చిరునవ్వు.

ఎపుడు మన ముందుంటుందో,
మనతో వుంటుందో...?
ఎపుడు మన నుండి దాగుంటుందో,
మనతో దోబూచులాడుతుందో...?

తెలుస్తుందా...?

వస్తుంది.
వెళ్తుంది.
కానీ,
మధ్యలోని
అగణిత అనుభవాలను
మాత్రం
మనసుకు తోడుగా మిగిలిస్తుంది. 

Sunday, April 2, 2017

చెప్పిన పదాలు

నువ్వెదురైన... ఆ క్షణం...
చుట్టూ నిశ్శబ్ధం.
కాదు కాదు.
నిశ్శబ్ధంలా అనిపించింది.

అప్పుడేవో
కాసిన్ని పదాలు చెప్పావ్.
పెదాలతో కాదు.
కళ్ళతో.
ఒక్కోసారి కొన్ని పదాలు
పెదాలపై కంటే
కళ్ళపైనే బావుంటాయి.

నువ్వొచ్చావ్, చెప్పావ్, వెళ్ళిపోయావ్.
నాలాగే నీకూ
పదాలేవీ వినిపించలేదా?
వినిపించే వుంటాయి.
నువ్వు కూడా ఆ క్షణాన్ని
ఇలానే తలచుకుంటూ వుంటావు.
ఇదంతా నా అభిప్రాయమే
వాస్తవం అయితే బావుండు.
ఏమో! వాస్తవం కూడా కావచ్చు.

మళ్ళీ అలాంటి క్షణం
వస్తుందా?
వస్తుందిలే.
నమ్మకం..
నే విన్న పదాలపై.